వైద్య ఆరోగ్య శాఖలో ఏసీబీ కలకలం డీఎంహెచ్ఓ సహా పలువురి అరెస్టు
హైదరాబాద్, అక్టోబర్ 5(చక్రవాణి న్యూస్) :తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏసీబీ వరుస దాడులు, అరెస్టులతో కలకలం రేగింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ బి.స్వర్ణకుమారి ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు లైసెన్స్ జారీ చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసి, తొలి విడతగా రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెతో పాటు హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ప్రైవేట్ డ్రైవర్ కృష్ణయ్యను అరెస్ట్ చేశారు.మరోవైపు నిమ్స్ మాజీ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో నగదు, బంగారం, బంజారాహిల్స్‌లోని ప్లాట్లు, భూములకు సంబంధించిన పత్రాలు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.అలాగే జీహెచ్ఎంసీ మెహదీపట్నం సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ తుంకిశెట్టి సునీత భవన నిర్మాణ అనుమతి కోసం రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆమె వద్ద మరో రూ.2.50 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లంచాలు, అక్రమాస్తుల ఆరోపణలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
