వెల్మలపల్లి పాఠశాలలో ఏకరూప దుస్తులు పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య: సర్పంచ్ బండి స్వామి, ఎంఈఓ లక్ష్మణ్ బాబు
మల్హర్ , సెప్టెంబర్ 23 (చక్రవాణి న్యూస్) మండల కేంద్రమైన తాడిచర్ల వెల్మలపల్లి ఎంపిపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు బుధవారం ఏకరూప దుస్తులు, షూస్, బెల్ట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ బాబు, గ్రామ సర్పంచ్ బండి స్వామి హాజరయ్యారు. విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించిన ఎంఈఓ.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్య మధ్య తేడాలను వివరించి, వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలో మరిన్ని అడ్మిషన్లు జరిగేలా చూడాలని కోరారు.సర్పంచ్ బండి స్వామి మాట్లాడుతూ.. మూతపడిన పాఠశాల పునఃప్రారంభమై ప్రస్తుతం 26 మంది విద్యార్థులతో కొనసాగడం సంతోషకరమన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం తిరుపతిరెడ్డి, సీఆర్పీలు సమ్మయ్య, సమత, పాఠశాల పూర్వ ఉపాధ్యాయుడు బెజగం సతీష్, హెచ్ఎం ఎన్.సురేష్, గంగరాజు, మధ్యాహ్న భోజన సభ్యురాలు రాజేశ్వరి, స్కావెంజర్ సమ్మక్క, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


