తాడిచెర్లలో వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమంటూ విశ్వబ్రాహ్మణ
సంఘం పిలుపు
మల్హర్, సెప్టెంబర్ 17,(చక్రవాణి న్యూస్) :భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహించారు.జయంతి సందర్భంగా గ్రామంలోని విశ్వకర్మ భగవానుని ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, కుల పెద్దలు కలిసి సంఘం జెండాను ఆవిష్కరించారు. “జై విశ్వకర్మ.. విశ్వబ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ చేసిన నినాదాలతో తాడిచెర్ల పురవీధులు మారుమోగాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సంఘ నాయకులు మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో, సాంకేతిక అభివృద్ధిలో విశ్వకర్మ వంశస్థుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సాంకేతిక రంగానికి మూలపురుషుడైన విశ్వకర్మ భగవానుని ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సాధించుకోవాలంటే విశ్వబ్రాహ్మణ ఉపకులాలు, సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యత ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందని, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, కుల పెద్దలు కందుకూరి మొగిలి చారి, ఒజేల రాజబాబు చారి, ఉట్నూరీ రవి చారి, ఒజేల చంద్రచారి, అనసూరి మొండయ్య చారి, పోలోజు రాముచారి, ఒజేల శంకరయ్య చారి, అనసూరి రమేష్ చారి, నూతి శ్రీకాంత్ చారి, పోలోజు కృష్ణమాచారి, నూతి సతీష్ చారి, నూతి సంతోష్ చారి, నూతి నరేష్ చారి, నూతి మహేష్ చారి తదితరులతో పాటు మండల, గ్రామ కమిటీల బాధ్యులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
