ధాన్యం రవాణాపై ప్రత్యేక నిఘా....భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు
భూపాలపల్లి, సెప్టెంబర్ 29 (చక్రవాణి న్యూస్): వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లతో సన్నద్ధత సమావేశం నిర్వహించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం రవాణా వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, రవాణాలో ఇబ్బందులు కలిగిస్తే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. వర్షాల నుంచి ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.జిల్లాలో మొత్తం 1,05,400 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. రైతుల ఫిర్యాదుల కోసం జిల్లా కంట్రోల్ రూమ్ 9390350142, రాష్ట్ర టోల్‌ఫ్రీ 1967, 180042500333 నంబర్లకు సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
