పెళ్లి ఆశలు ఆవిరి.. యువతి మృతి
వివాహానికి నిరాకరించాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
కర్నూలు , సెప్టెంబర్ 21(చక్రవాణి న్యూస్) :
పదేళ్లుగా కొనసాగిన ప్రేమ బంధం విషాదాంతంగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహానికి నిరాకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవార్పేటకు చెందిన మంజుల, గోనెగండ్లకు చెందిన కృష్ణమూర్తి గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మంజుల బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ పరీక్ష రాయగా, కృష్ణమూర్తికి ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉద్యోగం వచ్చిన అనంతరం పెళ్లి విషయమై మాట్లాడగా వివాహానికి నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో మంజుల తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో పురుగుల మందు తాగినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమెను కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.
కుమార్తె మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
మీ చక్రవాణి న్యూస్
నేటి అక్షర ధ్వని
అన్యాయంపై అక్షర సమరం..
అవినీతిపై సుదర్శన చక్రం!
అవినీతిపై సుదర్శన చక్రం!
ప్రజల మాట.. మా అక్షరం
