వేగం కాటేసింది.. బ్యాంక్ అధికారి మృతి కొల్హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఎర్టిగా కారు ఢీకొనడంతో గాల్లోకి ఎగిరి పడ్డ దంపతులు. భార్య పరిస్థితి విషమం
కొల్హాపూర్, సెప్టెంబర్ 29 (చక్రవాణి న్యూస్): మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెత్వడ్గావ్–హత్కనంగలే రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు బైక్‌ను ఢీకొట్టడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచ్ అధికారి దీపక్ రావుసాహెబ్ షిండే (45) అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్య ఆశారాణి (40) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మితిమీరిన వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి రాంగ్‌రూట్‌లోకి వెళ్లి బైక్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఢీకొన్న తీవ్రతకు దంపతులు సుమారు 15 అడుగుల ఎత్తుకు ఎగిరి రోడ్డుపక్కన పడిపోయారు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సమాచారం అందుకున్న పెత్వడ్గావ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు డ్రైవర్ సాహిల్ రాజు ఫజల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
