వెయ్యి కోట్ల హామీ ఏమైంది?.. ఓయూపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
లా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (చక్రవాణి న్యూస్):
ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ గణేశ్ ఉత్సవాల్లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లా కాలేజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని సీఎం రేవంత్‌రెడ్డిని కవిత ప్రశ్నించారు. లా కాలేజీ విద్యార్థులు నెలలుగా కనీస సౌకర్యాల కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
దాదాపు పది నెలలుగా విద్యార్థులకు మెస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటి సమస్యతో పాటు విద్యార్థుల గదుల్లోకి పాములు వస్తున్నాయని తెలిపారు. యూనివర్సిటీ డిస్పెన్సరీ కూడా పరిమిత సమయం మాత్రమే పనిచేస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందన్నారు.
విద్యార్థులు ఐదారు నెలలుగా రోడ్డుపై వంటలు చేసుకుంటూ నిరసనలు చేస్తున్నారని, అయినా సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయమని కవిత పేర్కొన్నారు. మంత్రి సీతక్క కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థేనని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
లా కాలేజీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన మద్దతు ఇస్తుందని కవిత తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అవసరమైతే విద్యార్థులతో కలిసి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
