భూపాలపల్లి జిల్లా లో అల్పాహారం ప్రారంభమెప్పుడూ..?
మంథనిలో ప్రారంభమై నెల రోజులు.. జిల్లాలో ఇంకా అమలుకు నోచుకోని సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్
మంత్రి శ్రీధర్‌బాబు దృష్టిసారించి జిల్లాలోనూ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి
మంత్రి శ్రీధర్ బాబు కు విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి
భూపాలపల్లి, సెప్టెంబర్ 24 (చక్రవాణి న్యూస్):ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం ఇంకా ప్రారంభానికి నోచుకోలేదనే విషయం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆగస్టు 24న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ కిచెన్ ద్వారా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించేలా ప్రణాళిక రూపొందించారు.అయితే మంథనిలో కిచెన్ ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్నా భూపాలపల్లి జిల్లాలో ఈ అల్పాహార కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పథకం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే ప్రశ్న తల్లిదండ్రులు, విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.విద్యార్థులు పాఠశాలకు ఖాళీ కడుపుతో వెళ్లకుండా పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు మంథని ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు.భూపాలపల్లి జిల్లాలోనూ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా అల్పాహారం అందించే కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించేలా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా దృష్టిసారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని పథకం అమలులో ఉన్న జాప్యానికి కారణాలను స్పష్టం చేసి, విద్యార్థులకు అల్పాహారం అందించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

