లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్ఐ
కీసర పీడీఎస్ బియ్యం కేసు వ్యవహారం
వినాయక నిమజ్జన ప్రాంతంలో వలపన్ని పట్టుకున్న ఏసీబీ
కీసర, సెప్టెంబర్ 19 (చక్రవాణి న్యూస్):
పిడీఎస్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నట్లు తెలిసింది.పిడీఎస్ బియ్యం అక్రమ దందాకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. స్టేషన్ బెయిల్ కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేశారని బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం బేరసారాల్లో రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది.లంచం మొత్తంతో పాటు నిందితుడి నుంచి బిర్యానీలు, డ్రింక్స్ తదితరాలను ఆన్లైన్లో తెప్పించుకునేవారని కూడా బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పథకం ప్రకారం వల పన్నారు.కీసర చెరువు వద్ద వినాయక నిమజ్జన బందోబస్తులో ఉన్న ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డికి రూ.5 లక్షలు తీసుకురావాలని చెప్పినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అక్కడే ఉన్న సీఐ ఆంజనేయులు సమక్షంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు సమాచారం.ఏసీబీ అధికారులు పట్టుకునే సమయంలో ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా అధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం రసాయన పరీక్షలు నిర్వహించి ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

