గంజాయి ముఠాతో ఖాకీల 'దోస్తానా'..!

పోలీసులపైనే కుక్కలను ఉసిగొల్పి, స్క్రూడ్రైవర్‌తో దాడి చేసిన నిందితులు 

 ఈగల్ టీమ్ రైడ్‌తో గుట్టురట్టు.. బాలానగర్ పీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ హస్తం?

హైదరాబాద్ క్రైం , (చక్రవాణి న్యూస్) : నగరంలో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాతో కొందరు పోలీసు అధికారులు చేతులు కలిపిన వైనం కలకలం రేపుతోంది. బాలానగర్‌లోని వినాయక్‌నగర్ శ్మశానవాటిక సమీపంలో ఒక ఇంట్లో నివసిస్తూ, 2022 నుండి గంజాయి సరఫరా చేస్తున్న ఏపీలోని పాడేరుకు చెందిన దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ అనే ముగ్గురు అన్నదమ్ముల గుట్టును 'ఈగల్ టీమ్' పోలీసులు రట్టు చేశారు. 
 •రైడ్‌కు ముందే పోలీసులతో పార్టీలు! 
 ఏపీ-ఒడిశా సరిహద్దుల నుండి గంజాయిని తీసుకువచ్చి, చిన్న చిన్న పొట్లాలుగా మార్చి వాట్సాప్ ద్వారా విక్రయిస్తున్న ఈ ముఠా వెనుక స్థానిక పోలీసుల అండదండలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈగల్ టీమ్ దాడి చేయడానికి కొన్ని గంటల ముందే నిందితుల ఇంట్లో బాలానగర్ పీఎస్కు చెందిన ఒక ఎస్సై, కానిస్టేబుల్ కలిసి పార్టీ చేసుకున్నట్లు సమాచారం. సదరు ఎస్సై రెండు రోజుల క్రితమే బాలానగర్ పీఎస్ నుండి బదిలీ అయ్యారు. ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రైవేట్ పార్టీలకు ఈ నిందితులే మద్యం, క్యాటరింగ్ సరఫరా చేస్తూ, ప్రతిఫలంగా తనిఖీల సమాచారాన్ని ముందే తెలుసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 •పోలీసులపైనే కుక్కలతో దాడి 
 బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అన్నదమ్ములు ముగ్గురూ ఇంటికి వచ్చినట్లు గుర్తించిన ఈగల్ టీమ్ పోలీసులు వారిని చుట్టుముట్టారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపైకి తమ పెంపుడు కుక్కను ఉసిగొల్పి, స్క్రూడ్రైవర్‌తో పొడిచి దాడికి తెగబడ్డారు. అయినప్పటికీ పోలీసులు సాహసంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 •కస్టమర్లలో 72 మందికి పాజిటివ్ 
 నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, వారి వద్ద నుండి సుమారు 203 మంది గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వారిలో వంద మందిని పట్టుకుని పరీక్షించగా, ఏకంగా 72 మందికి గంజాయి పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో భాగస్వామ్యమున్న పోలీసులపై కూడా శాఖాపరమైన కఠిన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments