మళ్లీ కలకలలాడిన యూపీఎస్ వెలుమలపల్లి ప్రభుత్వ పాఠశాల!


 పూర్వ విద్యార్థుల కృషి తో... 

ఎంఈఓ లక్ష్మణ్ బాబు పట్టుదలతో సాకారమైన పాఠశాల పునఃప్రారంభం!

పాఠశాల అభివృద్ధికి డిఈఓ అభయం..

 తొలిరోజే ఇద్దరు ఉపాధ్యాయుల నియామకంపై తల్లిదండ్రుల హర్షం

నిరంతర కృషి, సంకల్పం ఉంటే మూతబడిన ప్రభుత్వ పాఠశాలలకు సైతం పూర్వవైభవం తీసుకురావచ్చని మలహర్రావు మండలంలోని యూపీఎస్ వెలుమలపల్లి పాఠశాల పునఃప్రారంభం నిరూపించింది. గత కొంతకాలంగా విద్యార్థులు లేక, శిథిలావస్థకు చేరి తాళం పడిన ఈ బడి.. గురువారం అధికారులు, గ్రామస్తుల సమక్షంలో సరికొత్త శోభతో పునఃప్రారంభమైంది. మండల విద్యాధికారి (ఎంఈఓ) లక్ష్మణ్ బాబు తీసుకున్న చొరవతో పూర్వ విద్యార్థుల అకుంఠిత దీక్ష ఈ పాఠశాల పునరుజ్జీవనానికి.. నవ వసంతానికి పునాది వేసింది.

•ఎంఈఓ అకుంఠిత కృషి.. డీఈఓ అనుమతులు•

పాఠశాల దీనస్థితిని గమనించిన ఎంఈఓ లక్ష్మణ్ బాబు ప్రత్యేక శ్రద్ధ వహించారు. పూర్వ విద్యార్థులను, గ్రామస్తులను ఒకతాటిపైకి తెచ్చి బడి ఆవరణను శుభ్రం చేయించడంతో పాటు, బడిని తిరిగి తెరిపించేందుకు నిరంతరం శ్రమించారు. ఈ ప్రతిపాదనలను జిల్లా విద్యాధికారి రవీందర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించి, అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేశారు. గురువారం డీఈఓ రవీందర్ చేతుల మీదుగా పాఠశాల ఘనంగా రీఓపెన్ చేయబడింది.

••ఇద్దరు ఉపాధ్యాయుల కేటాయింపు••

పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఇద్దరు టీచర్లు నియామకమయ్యారు. అంతేకాకుండా, వెలుమలపల్లి యూపీఎస్ స్కూల్ పరిధిలోని విద్యార్థుల సంఖ్యను మరియు పాఠశాల స్థాయిని  మరింత పెంచేందుకు వీలుగా, భవిష్యత్తులో మరొక ఇద్దరు ఉపాధ్యాయులను ఇక్కడికి ప్రమోట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. బడికి వచ్చే విద్యార్థులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ఎంఈఓ స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు గానూ మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని రకాల మెరుగైన చర్యలతో పక్కాగా నిర్వహిస్తామని, పాఠశాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బండి స్వామి, మాజీ సర్పంచ్ మల్కా మోహనరావు, తాడిచర్ల కాంప్లెక్స్ హెచ్ఎం చీర్ల తిరుపతి, ఏఎమ్ఓ విజయపాల్ రెడ్డి, మాజీ హెచ్ఎం వంగ కుమారస్వామి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పద్మ, పాఠశాల ఉపాధ్యాయులు గంగరాజు, సీఆర్పీలు, ఎంఐఎస్ ఆపరేటర్లు పాల్గొన్నారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు రాగం అనీల్, బూడిద సతీష్, సంజీవ్, సంతోష్, ప్రశాంత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చక్రవాణి న్యూస్

ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం... అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!

#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments